ఏపీ: బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలెంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేసిన ఆయన, అనంతరం ప్రజా సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా “ఇప్పుడు ఇచ్చే ఒక్కో పింఛను… ఓటుకు నొక్కిన బటన్‌కి సమానం,” అంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.2,722 కోట్లు పింఛన్లకు ఖర్చవుతోందని, ఏడాదికి రూ.33,100 కోట్ల మేర వినియోగిస్తున్నామని చంద్రబాబు వివరించారు. పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా అన్న విషయాన్ని కూడా తాను గమనిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలోని కోటిన్నర లక్షల కుటుంబాలకు 64 లక్షల పింఛన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇదే దేశంలో అత్యంత పెద్ద మొత్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమమని పేర్కొన్నారు. “ఇది పేదల హక్కు. పింఛన్లు గౌరవంగా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాం,” అన్నారు.
“పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. అందుకే మార్గదర్శి బంగారు కుటుంబం పథకం తీసుకొస్తున్నాం. ఇంటింటికీ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలతో కలిసి ముందడుగు వేస్తా,” అని చంద్రబాబు స్పష్టం చేశారు.