హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ రోజు చేయించుకున్న ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎం కు పాజిటివ్ వచ్చింది. ఫాంహౌస్‌లో ఆయన ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షనలో ఉన్నారు.
సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదీన సాగర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొని వచ్చారు. నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియాలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాగా, ఇటీవలే నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా కరోనా సోకిన సంగతి విధితమే.
కాగా తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారిన పడినట్లు అయిందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల వ్యవధిలో ఈ వైరస్ బారిన పడి 14 మంది చనిపోయారు.
దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మరణించగా, 3,14,441 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.