హైదరాబాద్: ఢిల్లీలో త్వరలో నిర్మించబోయే టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి శంకు స్థాపన మరియు భూమిపూజతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నుండి మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు.
సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30కు ఢిల్లీ వసంత్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గరలో కేంద్రం కేటాయించిన 1,100 చదరపు మీటర్ల స్థలంలో టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణం కోసం సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భాగంగానే కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా ప్రధానితో భేటీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే సీఎం పర్యటనకు సంబంధించి సంపూర్ణ షెడ్యూల్ మంగళవారం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.
రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవన రుల శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. దానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం కేసీఆర్ సమావేశం కావొచ్చని సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.