ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు.
తెలంగాణ: రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టల్స్‌లో వెలుగుచూస్తున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆహార సరఫరాలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంతో.. సీఎం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను నిత్యం పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమైన ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించడంలో అలక్ష్యం ఉపేక్షించలేమని సీఎం హెచ్చరించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు తగిన విధంగా ప్రతీ పాఠశాల, హాస్టల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వివరాలను నివేదిక రూపంలో అందించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పడడంతో పాటూ ప్రభుత్వానికి నష్టం కలిగించే పరిణామాలు ఎదురవుతాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు మెరుగైన విద్య, ఆహారం అందించేందుకు తగిన నిధులు కేటాయించినప్పటికీ.. కొన్ని ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ప్రభావం చూపుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార సరఫరా విషయంలో నైతిక బాధ్యతతో మెలగాలని సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.
విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తప్పుడు ఉద్దేశంతో ప్రచారం చేస్తున్న వారి విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇలాంటి చర్యలు తల్లిదండ్రుల్లో అనవసర భయం కలిగించేందుకు దారి తీస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను పెంచిన విషయం సీఎం గుర్తు చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దుష్ప్రచారం చేయడాన్ని ఉపేక్షించమని స్పష్టం చేశారు.
ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో కచ్చితమైన ప్రమాణాలను పాటించేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. తక్షణమే అన్ని పాఠశాలల్లో ఆహార సరఫరా తీరును పునఃసమీక్షించాలని, అవసరమైన మార్పులు చేయాలని కోరారు.
విద్యార్థుల సంక్షేమాన్ని ప్రథమ కర్తవ్యంగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అవగాహన కలిగించాలంటూ సీఎం సూచించారు. అధికారుల నిర్లక్ష్యానికి బలి కావాల్సిన పరిస్థితి విద్యార్థులకు తలెత్తకూడదని ఆయన స్పష్టం చేశారు.