తెలంగాణ: తెలంగాణకు న్యాయం చేయాలని, రాష్ట్ర హక్కులను కేంద్రం దుర్వినియోగం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీమారు రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని విమర్శించారు.
హైదరాబాద్‌కు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలిపోవడం సహించబోమని హెచ్చరించారు. డీలిమిటేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎంపీ సీట్లు తగ్గవని అమిత్ షా చెబుతున్నా, పెరుగుతాయన్న హామీ మాత్రం ఇవ్వడంలేదని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
తెలంగాణ కేంద్రానికి భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, వాటిలో సగం కూడా రాష్ట్రానికి తిరిగి రాకపోవడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నామని, మోదీ వ్యక్తిగత ఆస్తులను కాదు అని రేవంత్ స్పష్టం చేశారు.
మెట్రో, ఆర్ఆర్ఆర్ వంటి ప్రాజెక్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవడానికి ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు.
దేశంలో భాషలు, ప్రాంతీయ అస్మితను బలవంతంగా దెబ్బతీయకూడదని రేవంత్ సూచించారు. తెలంగాణ భాషా సంస్కృతిని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.