తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కొత్త టీచర్లు నియామక పత్రాలు నేడు అందుకోనున్నారు.
తెలంగాణ: ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నెరవేరే సమయం రానేవచ్చింది. ఈరోజు 10,006 మంది ఉపాధ్యాయులు తమ నియామక పత్రాలను అందుకోనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై, స్వయంగా కొంతమందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.
మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గానూ, ఈ నియామక ప్రక్రియలో 10,006 మంది అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల 1,056 ప్రత్యేక విద్యాధికారులు మరియు పీఈటీ పోస్టులు ఇంకా భర్తీ కావలసి ఉందని విద్యాశాఖ అధికారికంగా తెలిపింది.
ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు జరిగిన DSC పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.