హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పణ అనంతరం ఈ నోటిఫికేషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించనుంది.
సీఎం రేవంత్, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన పూర్తి చేయడంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణను ఎలాంటి సమస్యలు లేకుండా అమలు చేయాలని, బీసీ కులగణన పూర్తి చేయడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్, మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించి, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఏకసభ్య న్యాయ కమిషన్‌ను హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం, ఈ కమిషన్ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలన్నారు. నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
బీసీ కులగణన
తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సర్వే 60 రోజుల్లోగా పూర్తవ్వాలని, డిసెంబర్ 9 లోపు నివేదిక అందించాలని సూచించారు. సర్వే పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.