అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు.
అక్కడ నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని, గ్రామంలో ‘108’ వాహనాలను ఏడు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
ప్రస్తుతం 25 మంది ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని, రెండు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు. జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తాం. ప్రజలెవరూ ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని’’ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.