తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్యుత్ పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా మరియు విద్యుత్ కొరత లేకుండా అమలు చేయాల్సిన ప్రణాళికలు మరియు మునుముందు దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్ష నిర్వహించారు.
ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలియ జేశారు. మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి రెండు ర్యాకులు బొగ్గు కూడా అదనంగా వచ్చిందని అధికారులు తెలిపారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని కూడా సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి బొగ్గు తెప్పివ్వడానికి సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు జరపాలని, దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని ఆయన అన్నారు. దీని కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సలహా ఇచ్చారు.