అమరావతి: జగన్ 2.0 కామెంట్స్‌పై కూటమి నేతల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ 2.0లో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా పనిచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో, కూటమి నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ఎమ్మెల్యేలకే దిక్కులేని జగన్.. కార్యకర్తలను పట్టించుకుంటారా?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా పట్టించుకోలేదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. తన ప్రభుత్వ హయాంలో పార్టీ నేతలే నిరాశకు గురయ్యారని, అందుకే పెద్దఎత్తున ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వ్యాఖ్యానించారు. “ఎమ్మెల్యేలకు అండగా నిలవని వ్యక్తి కార్యకర్తలను ఆదుకుంటాడని నమ్మడం మూర్ఖత్వం” అంటూ నేతలు విమర్శించారు.
జగన్ పాలనపై తీవ్ర విమర్శలు
కూటమి నేతలు జగన్ ఐదేళ్ల పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, “ప్రజలు జగన్ పాలనను భరించలేక మొట్టికాయలు వేశార”, “ఆ మొట్టికాయల వాపు ఇంకా తగ్గలేదు” అంటూ విమర్శించారు. జగన్ పాలన అహంకారంతో నిండిపోయిందని, అందుకే ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని తిప్పికొట్టారని అన్నారు.
సబ్ ప్లాన్ నిధులు సైతం..
జగన్ హయాంలో అన్ని వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించారని, అలాంటిది సంక్షేమం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం అని, “ఆయన పాలనలో ఎవరూ సుఖంగా లేరు” అని కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ వ్యాఖ్యలపై నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన వైసీపీ పాలన
కంపెనీలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేశారు, దాంతో ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని కూటమి నేతలు విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు “ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి నిర్మిస్తున్నా”, కానీ జగన్ తట్టుకోలేక అసహనంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు.
175కి 175 అంటూనే ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్!
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గతంలో “175 కి 175, 25కి 25” అని ప్రచారం చేసిన జగన్, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని విమర్శించారు. జగన్ “నేను బటన్ నొక్కా.. బటన్ నొక్కా” అంటూ చెప్పుకుంటుంటే, చివరకు ప్రజలకు “బటన్ నొక్కి బటర్ మిల్క్ ఇచ్చారు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుపై తీవ్ర విమర్శలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కూడా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “గుండెపోటు అన్నారని, జగన్ రెప్పకు దెబ్బ తగిలితే మాత్రం అది హత్యాయత్నం అని చెబుతారా?” అంటూ నిలదీశారు. జగన్ “పెద్ద అంగడి”, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి “సూపర్ మార్కెట్”, మిగిలిన వైసీపీ నేతలు “చిల్లర అంగడి” అని వ్యాఖ్యలు చేశారు.
కూటమి నేతల ఏకగ్రీవ విమర్శలు
కూటమి నేతలు మొత్తం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. “వికసిత భారత్ ద్వారా ఏపీని అభివృద్ధి చేసి, వైసీపీకి భవిష్యత్ లేకుండా చేస్తాం” అని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.