చలి పులి పంజా విసరడంతో తెలంగాణ విలవిలలాడుతోంది
తెలంగాణ: రాష్ట్రాన్ని చలి గాలులు వణికిస్తున్నాయి. ఉత్తర నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 8 నుండి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.
వాతావరణ శాఖ ప్రకారం, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, వికారాబాద్ వంటి జిల్లాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి మరియు తెల్లవారుజామున చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల్లో మల్కాజ్‌గిరిలో 13.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 13.7 డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
చలితీవ్రత కారణంగా దగ్గు, జలుబు, ప్లూ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వీరికి స్వెటర్లు ధరింపజేసి వెచ్చగా ఉంచాలని సూచిస్తున్నారు.
అంతేకాకుండా, చలి ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. వ్యవసాయ అవసరాలతో పాటు గృహ వినియోగంలో కూడా విద్యుత్ అవసరం బాగా తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో గత సంవత్సరంతో పోలిస్తే చలితీవ్రత పెరిగిందని, ఉత్తర నుంచి వీస్తున్న గాలులే ఇందుకు కారణమని వాతావరణశాఖ వెల్లడించింది. మార్నింగ్ వాక్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గడం, విద్యార్థులు ఉదయాన్నే స్కూళ్లకు వెళ్ళడానికి ఇబ్బందిపడటం వంటి మార్పులు పెరుగుతోన్న చలిని ప్రతిబింబిస్తున్నాయి.