ఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య గడచిన రెండు నెలలుగా పొరపొచ్చాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, ఇండియా కూటమి ఉనికి, పార్టీ నాయకత్వం విషయాలపై వీరి అభిప్రాయ బేధాలు బహిర్గతమవుతున్నాయి.
రాహుల్ గాంధీ తాను ఖర్గేకు ముందస్తు సమాచారం లేకుండా ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమవడం ఈ విభేదాలకు దారితీసిన కారణం.
ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసి బీజేపీ ఓటు చీల్చాలని భావిస్తుండగా, రాహుల్ ప్రత్యక్ష పోరాటానికి మొగ్గుచూపారు. ఈ వ్యూహపరమైన విభేదాలు పార్టీ భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇండియా కూటమి పటాపంచల అవుతున్న సంకేతాల మధ్య, రాహుల్, ఖర్గే మధ్య పరస్పర విమర్శలు చెలరేగుతున్నాయి. ఖర్గే నాయకత్వాన్ని విమర్శిస్తూ, రాహుల్ బృందం తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తోంది.
ఇక, వచ్చే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఖర్గే రిటైర్మెంట్ అంశం కూడా చర్చనీయాంశంగా మారిన సంగతి గమనార్హం.