న్యూఢిల్లీ: ప్రధాని మోదీ స్పందనతో మోదీపై కారాలు మిరియాలు నూరుతున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులకు మరిన్ని ఆయుధాలు అందించారా? పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామం, తర్వాత మోదీ స్పందించిన తీరు, వంటివి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొనేలా చేశాయి.
అసలేం జరిగింది?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పక్ష నాయకుడు, పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పద్మవ్యూహం పన్నారని ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు.
కేవలం ఆరుగురు మాత్రమే ఈ దేశాన్ని శాసిస్తున్నారని చెప్పారు. మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ, మోహన్ భగవత్ వంటి వారి పేర్లను రాహుల్ ప్రస్తావించారు. ఈ క్రమంలో తాము ఈ పద్మవ్యూహాన్ని కుల గణన ద్వారా భేదిస్తామని రాహుల్ ప్రకటించారు. అయితే పదే పదే రాహుల్ కుల గణన అంటూ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోకసభలోనే స్పందిస్తూ కులం లేని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారు అంటూ రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం నాటి సభలో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు, సభ్యులు కూడా సభలో విరుచుకుపడ్డారు. దీంతో రికార్డుల నుంచి మంత్రి చేసిన ఠాకూర్ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ప్రకటించి వాటిని తొలగించారు.
వివాదం సర్దుమణిగిందా?
ఇక్కడితో వివాదం సర్దుమణిగింది, ఇరు పక్షాలు శాంతించాయి. కానీ, ఆ తర్వాతే కథ మొదలైంది…
మోదీ స్పందన!
లోకసభలో మంత్రి ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. దీనిలో ఆయన ఠాకూర్ చేసిన కులం లేని వారు కుల గణన కోరుతున్నారన్న వ్యాఖ్యలను ప్రశంసించారు. అంతేకాదు తప్పనిసరిగా వినాల్సిన ప్రసంగం అని పేర్కొన్నారు.
అక్కడితో కూడా ఆగకుండా ఇండియా కూటమి చేస్తున్న మురికి రాజకీయాలను తన చతురతతో ముడిపెట్టి, హాస్యాన్ని కలగలిపి మంత్రి ఠాకూర్ చక్కగా స్పందించారని కూడా మోదీ పేర్కొన్నారు.
ఇక ఈ వివాదం ఒక్కసారిగా తారస్థాయికి చేరింది.
సభ హక్కుల తీర్మానం
ప్రధాని చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు కత్తులు దూశాయి. నిప్పులు చెరిగాయి.
అంతేకాదు, ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ (సభ హక్కుల తీర్మానం) ప్రవేశ పెట్టాయి.
దీనిని కాంగ్రెస్ ఎంపీ చరణజిత్ సింగ్ చన్నీ సభలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ దీనిని అనుమతించారు. దీనిపై సమయం కేటాయిస్తామన్నారు.
ఏం జరుగుతుంది?
ప్రివిలేజ్ మోషన్ అనేది లోకసభ, రాజ్యసభల్లో అత్యున్నత తీర్మానం. ఎవరైనా ఎంపీ లేదా, మంత్రి సభా నియమాలకు భంగం కలిగించినా, సభా హక్కులకు విఘాతం కలిగించినా, తోటి సభ్యులను అవమాన పరిచినా చర్యలు కోరుతూ చేపట్టే తీర్మానం.
దీనిపై సభలో సమయం అనేదే లేకుండా చర్చించేందుకు తీర్మానం ప్రవేశ పెట్టిన పక్షానికి మైకులు ఇస్తారు. ఇప్పుడు ఈ తీర్మానం ఏకంగా ప్రధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు. ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థలో తొలిసారి కావడం గమనార్హం.
దీంతో ఎన్ని రోజులైనా సభను నడిపించాల్సి వస్తుంది. పైగా విపక్షానికే ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోదీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ వంటి ఇండియా కూటమి నాయకులు తెరమీదికి తెచ్చారు. కాంగ్రెస్ కూడా ఒప్పుకుంటే ఈ విషయంపైనే సభలో చర్చ సాగుతుంది.
కులం లేని వాడు అంటూ రాహుల్‌ను గతంలోనూ తిట్టిపోశారు. ఇప్పుడు పార్లమెంటు వేదికగా కూడా వ్యాఖ్యానించడంతో పార్టీ సీరియస్‌గా తీసుకుంది.
మొత్తానికి మోదీకి వ్యతిరేకంగా మెజారిటీ ఎంపీలు ఓటేస్తే ఆయనకు ఇబ్బందే. కొన్నాళ్లపాటు ఆయనను సస్పెండ్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు కూడా, ఎందుకంటే వారి తరఫునే బలం ఉంది.