fbpx
Monday, October 21, 2024
HomeBig Storyఅమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర: FBI ఆపరేషన్‌తో భగ్నం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర: FBI ఆపరేషన్‌తో భగ్నం!

Conspiracy to attack the US presidential election day – FBI operation busted

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజున ఉగ్రదాడి చేయాలని కుట్ర పన్నిన అఫ్గానిస్థాన్‌ పౌరుడిని FBI అరెస్టు చేసింది. ఐఎస్ఐఎస్‌ ప్రేరణతో ఈ ఉగ్రదాడికి ప్రణాళిక రచించిన నాసిర్‌ అహ్మద్‌ తౌహేదీ (27) అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. అమెరికా న్యాయశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.

వివరాలలోకి వెళితే..

2021 సెప్టెంబరులో తౌహేదీ ప్రత్యేక వలస వీసాపై అమెరికా ప్రవేశించాడు. ప్రస్తుతం అతను ఓక్లహోమా సిటీలో నివసిస్తున్నాడు. తౌహేదీ, ఐఎస్ఐఎస్‌ ఉగ్రసంస్థ ప్రభావంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజున (నవంబర్ 5) పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కాల్పులు జరపాలని ప్రణాళిక రచించాడు.

దాడి పథకం

తౌహేదీ, తన సహచరులతో కలిసి, ఆత్మహుతి దాడి చేయాలని పథకం రచించాడు. ఈ దాడిలో తాను సహా, కొందరు ఉగ్రవాదులు ప్రజలపై ఆత్మాహుతి దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్రలో భాగంగా తౌహేదీ ఏకే-47 రైఫిల్స్ ఆర్డర్ చేసాడు. దాడికి ముందు భార్యాబిడ్డలకు స్వదేశానికి పంపడానికి టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాడు.

FBI ఆపరేషన్

ఈ ఏడాది జులైలో వైట్‌ హౌస్‌, వాషింగ్టన్‌ వెబ్‌ కెమెరాలను సందర్శించినట్లు తేలింది. దీంతో తాహౌదీపై అధికారులు కన్నేశారు. తౌహేదీపై ఎఫ్‌బీఐ గట్టి నిఘా పెట్టడంతో అతడు ఇటీవల ఫేస్‌బుక్‌ ద్వారా తన ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఎఫ్‌బీఐ ఒక ఇన్‌ఫార్మర్‌ను నియమించింది. ఆ ఇన్‌ఫార్మర్ గన్ సప్లయర్‌ గా నటిస్తూ తౌహేదీతో చనువుగా మాట్లాడాడు. ఇన్‌ఫార్మర్‌ సహాయంతో ఎఫ్‌బీఐ తౌహేదీ, అతని మైనర్ సహచరుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి సహచరుడు మైనర్ కావడంతో అతడి పేరు ప్రకటించలేదు.

ఉగ్రవాద మద్దతు కార్యకలాపాలు

ఎఫ్‌బీఐ విచారణలో తౌహేదీ గతంలో ఐఎస్ఐఎస్‌కు మద్దతు ఇచ్చే సంస్థలతో పనిచేసినట్లు తేలింది. అతను ఉగ్రవాద కార్యకలాపాల్లో ఆసక్తి ఉన్న వ్యక్తులకు బోధనలు చేయడం, నియామకాలు జరపడం చేసేవాడు.

FBI ఆపరేషన్ విజయవంతం

తౌహేదీపై ఎఫ్‌బీఐ నిఘా పెట్టిన సమయంలో అతడు, తన మైనర్‌ సహచరుడితో కలిసి తమ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. FBI చాకచక్యంతో ఇన్‌ఫార్మర్‌ ద్వారా గన్ సప్లయర్‌ వ్యవహారం నడిపిస్తూ, ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి తౌహేదీని రెడ్-హ్యాండెడ్ గా పట్టుకుంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

తౌహేదీపై కేసు వివరాలు

తౌహేదీపై ఉగ్రవాద కుట్ర, అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడి ప్రణాళిక, ఐఎస్ఐఎస్‌ మద్దతు కార్యకలాపాలకు సంబంధించి అభియోగాలు మోపారు. ఈ కేసులో తౌహేదీకి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

FBI డైరెక్టర్‌ క్రిస్టోఫర్ రే స్పందన

ఈ కేసు గురించి FBI డైరెక్టర్‌ క్రిస్టోఫర్ రే మాట్లాడుతూ, “అమెరికా ప్రజల రక్షణ ఎఫ్‌బీఐ తొలి ప్రాధాన్యం” అని పేర్కొన్నారు. “ఉగ్రవాద దాడులను అరికట్టడానికి మరియు ప్రజలను రక్షించడానికి ఎఫ్‌బీఐ శాయశక్తులా ప్రయత్నిస్తుందని” ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular