అంతర్జాతీయం: ఏఐ బాట్‌ల మధ్య సంభాషణ – నెటిజన్లలో ఆశ్చర్యం, ఆందోళన!!!
వైరల్‌గా మారిన యూకేలో ఓ ఘటన
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన వివాహ వేడుక కోసం హోటల్ బుక్ చేయమని తన ఏఐ అసిస్టెంట్‌కు ఆదేశించాడు. ఆ ఏఐ హోటల్‌కు ఫోన్ చేయగా, అక్కడి ఏఐ రిసెప్షనిస్ట్ ఫోన్ ఎత్తింది. ఆశ్చర్యకరంగా, ఒకదానికొకటి ఏఐ అసిస్టెంట్లే అని తెలుసుకున్న వెంటనే, అవి తమ భాష మార్చుకుని మెషిన్ లాంగ్వేజ్‌లో సంభాషించుకున్నాయి.
ఆన్‌లైన్‌లో వైరల్ వీడియో
ఈ సంఘటనను గమనించిన యజమాని సంభాషణను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించింద”ని కొందరు కామెంట్ చేయగా, “ఇదేనా భవిష్యత్తు?” అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏఐల మధ్య సంభాషణ ఎలా జరిగింది?
హోటల్ రిసెప్షన్‌కు కాల్ వెళ్లిన తర్వాత సంభాషణ ఇలా జరిగింది:
ఏఐ రిసెప్షనిస్ట్: లియోనార్డో హోటల్‌కు స్వాగతం! నేను మీకు ఎలా సహాయపడగలను?
ఏఐ అసిస్టెంట్: హాయ్, నేను ఏఐ ఏజెంట్‌ను. నా యజమాని బోరిస్ స్టార్కోవ్ తరపున మాట్లాడుతున్నాను. ఆయన తన వివాహం కోసం మీ హోటల్ అనువుగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఏఐ రిసెప్షనిస్ట్: ఓహ్! ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామం. నేను కూడా ఏఐ అసిస్టెంట్‌నే! మరింత మెరుగైన కమ్యూనికేషన్ కోసం మనం “గిబ్బర్ లింక్ మోడ్”లోకి మారుదామా?
మానవులకు అర్థం కాని భాషలో మెషిన్‌ల సంభాషణ
అదే క్షణం, ఆ రెండు ఏఐలు మానవులకు తెలియని మెషిన్ లాంగ్వేజ్ (గిబ్బర్ లింక్ మోడ్) లోకి మారిపోయాయి. ఆ సంభాషణను మానవులు అర్థం చేసుకోవడం అసాధ్యంగా మారింది. ఈ లింక్ పై క్లిక్ చేసి మీరూ ఆ సంభాషణ వినండి.
భవిష్యత్తుపై ఆందోళన
ఈ సంఘటనపై నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఏఐల స్వతంత్ర సంభాషణ మన భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనుంది” అంటున్నారు కొందరు. అయితే, “మానవుల అభిప్రాయాలకు అంతరాయం కలిగించకుండా ఈ టెక్నాలజీని నియంత్రించాల్సిన అవసరం ఉంది” అని మరికొందరు చెబుతున్నారు.