హైదరాబాద్: అలుపే ఎరగకుండా పరిగెడుతూ వెళ్తున్న ఇంధన ధరలతో సామాన్యుడు సతమతమవుతున్న తరుణం ఇది. గత కొద్ది రోజులుగా, ఇంకా చెప్పాలంటే నెలకుపైగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు తీవ్రంగా పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొద్ది మొత్తం సబ్సిడీని కూడా ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది.
ఈ తరుణంలొ కొద్దిగా ఉపశమనం కలిగే వార్త ఒకటి వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెరిగాయి. తాజాగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ధరలు తగ్గనున్నాయని ఓ అధికారి తెలిపారు.