ఢిల్లీ : దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. దీంతో ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరుకున్నట్లు ఉందన్న అభిప్రాయాలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్ ప్రారంభమైందని అనడానికి ఇప్పుడే నిర్ధారణకు రాలేమని, మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు.
కాగా ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరే అవకాశం అయితే ఉందని తెల్పారు. ఒక్క రోజులోనే ఎన్నడూ లేని విధంగా కొత్తగా 5,673 కేసులు నమోదు కావడమే ఇందుకు గల కారణం. గత వారం రోజులుగా ఢిల్లీలో రోజూ సగటున సుమారు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
దేశంలో కేసుల తీవ్రత తగ్గుతున్నప్పటికీ రాజధానిలో మాత్రం అమాంతం కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఊహించనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చేది పండుగల సీజన్‌తో పాటు శీతాకాలం కావడంతో ఇప్పటివరకు అనుసరిస్తోన్న పద్ధతుల్లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు.
ఓ వ్యక్తికి కరోనా సోకితే అతని కుటుంబంతో సహా వారి సన్నిహితులకూ కరోనా పరీక్షలు చేస్తామని వివరించారు. మొదటగా వ్యాధి నిర్ధారణ అయిన 4-5 రోజుల అనంతరం తిరిగి మరోసారి పరీక్షలు చేస్తామని చెప్పారు. ఈనెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు సగటున 15 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది.
మొదట లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, ఆసుపత్రుల్లో ఇందుకు తగ్గట్లు పడకలు సిద్ధం చేయాలని సూచింంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలకు చేరుకుంది.