న్యూయార్క్ : ప్రపంచాన్ని ఇప్పటికీ గడగడాలాడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకలు వేర్వేరుగా జరిపిన రెండు తాజా అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్లడ్ గ్రూప్ ‘ఓ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, వారిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం చాలా తక్కువని ఓడెన్స్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఇప్పటివరకు ఈ కరోనా బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ప్రజలు తక్కువగా ఉండడం మరో విశేషమని, ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా, వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, వారి పట్లనే వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని డానిష్ పరిశోధకులు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మంది కరోనా కేసులపై వారీ అధ్యయనం జరిపారు.
ఓ, బీ బడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ గ్రూప్‌లపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ జరిపిన మరో అధ్యయనంలో బయట పడింది. ఓడెన్స్ అధ్యయనంలో కరోనా కేసుల్లో 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వారుకాగా, 62 శాతం మంది ఏ, బీ లేదా ఏబీ బ్లడ్ గ్రూప్‌లవారు ఉన్నారు.
అమెరికా, బ్రిటన్ దేశాల్లో 45 శాతం మంది ఏ, ఏబీ బ్లడ్ గ్రూప్‌లకు చెందిన వారే ఉండడం వల్ల వారంతా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది.