అమరావతి: ఆంధ్రలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతుండడం శుభ సూచకమని, పాజిటివిటీ రేటు కూడా 8.3 శాతానికి తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56.66 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని, కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కోవిడ్–19 నివారణ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో 240 కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో నమోదైన ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్స చేయాలని ఆదేశించామన్నారు. ఏయే ఆస్పత్రులలో కోవిడ్ చికిత్స అందుతోందనే సమాచారం తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. కోవిడ్, ఆరోగ్రశ్రీ ఆస్పత్రుల సమాచారం కూడా అందుబాటులో ఉండాలి. ఆ సమాచారం వలంటీర్లకు కూడా తెలియాలి. కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం మన బాధ్యత అని తెలిపారు.
కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన 6 నెలల కోసం వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది దాదాపు 17 వేల మంది నియామకానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. వారితో పాటు మరో 12 వేల మంది శిక్షణ నర్సులను నియమించుకోవాలని చెప్పాం. ప్రస్తుతం దాదాపు 20 వేల మంది సిబ్బంది నియామకం జరిగింది అని తెలియజేశారు.