విశాఖపట్టణం: ఏపీ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. రోజు వందల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీ పోలీసుల్లో కరోనా కలకలం రేపుతోంది. విశాఖపట్టణం లో డిజిపి సవాంగ్ మీడియా సమావేశంలో ఏపీ పోలీసుల్లో 470 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని పోలీసులకు విధులను కేటాయించే విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. 55 సంవత్సరాలు నిండిన పోలీసులకు కేవలం సాధారణ విధులు మాత్రమే కేటాయిస్తున్నామని తెలిపారు. కరోనా విధుల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని పంపడం లేదు అని ఆయన మీడియాకు తెలిపారు.
ఏపీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు ఖచ్చితాంగా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. అన్ లాక్ 2.0 అమలు లో ఉందని, ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. బయటకు వచినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. వీలయినంత తక్కువగా బయటకు రావాలని, పిల్లలను, వృద్ధులను బయటకు పంపవద్దని ఆయన తెలిపారు. అత్యధిక కేసుల్లో మరణాలు వృద్ధులలోను, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలోనే నమోదు అవుతున్నాయని అందుకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర కేసులు తక్కువ గానే ఉన్నట్లు తెలిపారు. ముంబయి లాంటి రాష్ట్రంతో పోలిస్తే పోలీసుల్లో తక్కువ కేసులు నమోదు అయ్యాయని, అయినా ఏపీ పోలీసులు కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని, వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వారి పై అధికారులకు తెలపాలని, అలాంటి వారికి విధుల్లో మినహాయింపు ఇస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో విధులు నిర్వహించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడిలో పోలీసులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ/వార్డు వాలంటీర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఈ సంధర్భంగా వారి సేవలను కొనియాడారు, మరియు వారిని గౌరవించాలని ప్రజలను ఆయన ఈ సంధర్భంగా కోరారు.