న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కమిటీ తెలియ జేసింది. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని పూర్తిగా కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే.
ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. దేశంలో మార్చిలో ఒక వేళ లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే భారత్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ నివేదికలో పేర్కొంది. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్‌లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా సామూహిక వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు.
అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ప్రజలు దసరా, దీపావళి సీజన్‌లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.