న్యూయార్క్: అగ్ర రాజ్యమైన అమెరికాను కరోనా మొదట్లొనే బాగా అతలాకుతలం చేసింది. మే నెల వరకు రోజు బారీగా కేసులు నమోదు కావడం, మరణాల రేటు కూడా అధికంగా ఉండేవి.
మే నెలలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇక కనిపించని శత్రువుపై విజయం సాధించామని జూన్ లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. లాక్ డౌన్ ఆంక్షలు తీసి వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. అప్పటి దాకా అంతా సాఫీగానే సాగింది.
ఇప్పుడు పరిస్థితి మళ్ళి మొదటికొచ్చింది. రోజుకు 30 వేల కేసుల నుండి ఇప్పుడు ఏకంగా 70వేల కేసులు నమోదవుతూ రికార్డులు బద్దలు కొడుతోంది. మొదట్లో న్యూయార్క్, న్యుజెర్సీ లలొ ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
అయితే ఇప్పుడు అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా, అలబామా, లూసియానా వంటి రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ పాకింది. అరిజోనాలో వారం రోజుల్లోనే 27% కేసులు పెరిగాయి. ఫ్లోరిడా, సౌత్ కరోలినాలో 19% పెరుగుదల కనిపిస్తోంది. టెక్సాస్‌లో 18%, జార్జియాలో 17% పెరుగుదల కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా కాలిఫోర్నియాను కరోనా కకావికలం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 27% కేసులు పెరుగుతున్నాయి.
టెక్సాస్‌లో రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు మూసివేశారు. లూసియానా, అలబామా, మోంటానాలో ప్రజలు ఇల్లు దాటి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి చేశారు. అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాలలో మరణాల రేటు అత్యధికంగా ఉంది.
అమెరికాలో కేసుల పెరుగుదల చూస్తుంటే రోజుకి లక్ష కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. వచ్చే శీతాకాలంలో అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనాని కట్టడి చేయడంలో అమెరికా చాలా తప్పుదారిలో నడుస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు తమ తీరు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు ఆంటోని ఫాసీ హెచ్చరించారు.