fbpx
Friday, December 27, 2024
HomeAndhra Pradeshకరోనా, డెంగీల వైద్యం పై కేంద్రం మార్గదర్శకాలు

కరోనా, డెంగీల వైద్యం పై కేంద్రం మార్గదర్శకాలు

CORONA-DENGUE-TESTS-MANDATORY

హైదరాబాద్‌: ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్‌గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రెండు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా, డెంగీ పరీక్షలు రెండూ చేయించాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో కాస్త గందరగోళం జరిగే ప్రమాదం ఉందని తెలిపింది.

మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడం చాలా అవసరం అని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది.

పలు సూచనలు:

► ఈ రెండు వ్యాధుల బారిన పడిన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. బాధితుడిలో లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స అందించే విధానం మార్చాలి.
► డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇవ్వాలి. అలాగే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే విషయంలో కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి.
► రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పరీక్షిస్తూ ఉండాలి.
► ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేయించాలి.
► ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
► ముఖానికి మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కరోనా నివారణ పద్ధతులు పాటించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular