ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఇప్పట్లో తగ్గేలాలేదు. ఒక పక్క ప్రజల ప్రాణాలు తీస్తూ మరో వైపు ప్రపంచాన్ని ఆర్థికంగా కూడా సంక్షోభంలోకి నెట్టేస్తోంది. గడచిన శాతాబ్దంలో ఇదే ఆతి పెద్ద సంక్షోభం అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
కోవిడ్ వల్ల ప్రపంచంలో ఉపాధి, ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం రంగాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలిచిన భారత ఆర్థిక, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత పరీక్ష కాలం’ అని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్‌క్లేవ్‌లో శనివారం శక్తికాంత్ దాస్ పై విధంగా స్పందించారు.
భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది మునుపటిలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలకు ఉపక్రమించింది, దాని ద్వారా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. లాక్ డౌన్ వల్ల, దాని తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, నిరర్ధక ఆస్తులు పెరిగాయని, మూలధనం క్షీణించిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్ లాక్ తరువాత ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగైనట్లు కనిపిస్తున్నాయన్నారు.
‘ఆర్థికంగా నిలదొక్కుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్‌బీఐ ముందు ఉన్న తక్షణ కర్తవ్యాలు. వాస్తవానికి ఈ సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు అద్భుత రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు.
డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడు చేరతాయి? సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? ఆర్థికాభివృద్ధిపై కరోనా మహమ్మారి ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై స్పష్టత కోసం ఇంకా వేచి చూసే పరిస్థితి ఉందన్నారు.
ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ తడబడకుండా చూస్తూ, ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా కొనసాగించేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు.
భారత ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని అయితే డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవడం వల్ల ఆ బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు.
అయితే ఇప్పుడు ఉన్న ఒడిదుడుకులు ఎదుర్కొనడానికి ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్దత కలిగిన ఒక రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. ఈ కార్పరేషన్ వల్ల అలాంటి సంస్థలను ముందుగానే గుర్తించడం, హెచ్చరించడం అవసరమైతే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్టే వీలు అవుతందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలో టాప్-10 లో ఉంది. అంతటి భారతదేశమే సంక్షోభంలో ఉంటే ఇతర చిన్నీ దేశాల పరిస్థితి వర్ణనాతీతం. మొత్తం ప్రపంచం ఈ మహమ్మారి దెబ్బకు కుదేలయింది. ఈ పరిస్థితి ఎంత త్వరగా తగ్గుముఖం పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు వేచి చూడవలసిన తరుణం.