హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఈ డాక్టర్లు తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచిపెట్టి మరీ రోగులకు వైద్యం చేస్తున్నారు. దీంతో వారి నుంచి వైద్యానికి వచ్చే రోగులకు కరోనా సోకుతోంది. పౌష్టికాహారంతో పాటు తగినంత విశ్రాంతి లేకుంటే వైరస్ లోడు పెరిగి వ్యాధి ముదురుతుందని తెలిసినా
కూడా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అసలే ఇది వర్షాకాలం, కరోనాకు తోడు సీజనల్ వ్యాధులు బాగా ప్రబలేకాలం. ఈ సమయంలో ప్రాక్టీస్ ఆపేస్తే తమ ఆదాయానికి గండిపడుతుందనే దురాశ కొందరు డాక్టర్లను వెన్నాడుతోంది. మరోవైపు ఇప్పుడే కాస్తంత డబ్బులు సంపాదించుకోవచ్చన్న కక్కుర్తి. చౌటుప్పల్‌లో క్లినిక్ నడుపుతున్న ఓ వైద్యుడి కుటుంబంలోని వారికి కూడా వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖలో వినికిడి. అయినా కాసుల ముందు ఆయనకు ఏ వైరసూ కనిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఒక ప్రభుత్వ డాక్టర్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన సమీప జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్. అక్కడ విధులు ముగించుకున్నాక సమీపంలోని చిన్న పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేస్తుంటారు. హైదరాబాద్, ఇక్కడికి రానూ, పోనూ 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణం చేస్తుంటారు. ఆ డాక్టర్‌కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. అయినా అంతదూరం సొంతం గా కారు నడుపుకుంటూ వెళ్లి వస్తున్నారు. అలా ఐదారు రోజులు విశ్రాంతి లేకుండా పనిచేయడంతో వైరస్ లోడ్ బాగా ముదిరింది.
దీంతో ఆ డాక్టర్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మరో ఆసుపత్రిలో ఎక్మో ట్రీట్మెంట్‌కు రిఫర్ చేసినట్లు సమాచారం. పాజిటివ్ వచ్చాక 14 రోజులు విశ్రాంతి తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా కొంత మంది దానిని లెక్కచేయడం లేదు.
పైగా కొందరు ప్రభుత్వ వైద్యులైతే పాజిటివ్ వచ్చాక సెలవు పెట్టి మరీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా సోకిన వైద్యులు ప్రాక్టీస్ చేసినట్లు నిర్ధారించుకున్నాక చర్యలు తీసుకుంటామని వెద్య, ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.