వాషింగ్టన్: కరోనా గురించి రోజుకొక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. మొదట్లో మనిషి నుంచి మనిషి కే వస్తుందని, తరువాత వస్తువుల ద్వారా, నోట్ల ద్వారా, ఇలా ఎదో ఒక కొత్త వస్తువుల ద్వారా వ్యాప్తిస్తుందనేది వింటున్నాం.
ఇప్పుడు తాజాగా మరో విషయం నిర్ధారణ అయ్యిందంటున్నారు నిపుణులు. గాలిలో ఉన్న కరోనా వైరస్ నాలుగ్గంటల తర్వాత కూడా వ్యాప్తి చెందవచ్చునని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. వెలుతురు తక్కువ వున్న ప్రాంతంలో ఆరడుగులకుపైగా సామాజిక దూరం పాటించినప్పటికీ కరోనా ఇతరులకు వ్యాప్తి చెందినట్లు చాలా ఆధారాలున్నాయని సీడీసీ తెలిపింది.
కరోనా సోకిన వారి నుంచి వెలువడే నీటి తుంపర్లు, రేణువులు, పొగమాదిరిగా గాలిలో కలిసి ఉండి, భూమిమీద పడతాయని అందుకే ఆరడుగుల సామాజిక దూరం నియమం పెట్టారని సీడీసీ తెలిపింది. తుంపర్లలో ఉన్న వైరస్ కొన్ని సెకన్ల నుంచి, గంటల వరకు గాలిలో ఉంటుందని, రెండు మీటర్లకు దూరం వరకు కూడా ప్రయాణం చేయగలుగుతుందని, తక్కువ వెలుతురు ఉన్న చోట గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు.