హైదరాబాద్: తెలంగాణ లో వచ్చే నెలాఖరు నాటికి కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులో ఉందని, కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.
వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ అదుపులోకి వస్తుందని తెలిపారు. సర్కారు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ప్రజలు కొద్దిరోజుల్లో సాధారణ జీవితం గడిపే పరిస్థితులు వస్తాయన్నారు. బయట నుంచి తీసుకొచ్చే సామాన్లను శానిటైజ్ చేయనవసరం లేదన్నారు. వాటి నుంచి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువన్నారు.
అలాగని అసలు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ రాకుండా ఉండదన్న గ్యారంటీ కూడా లేదని హెచ్చరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 వేల మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు.
సీజనల్ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయని, అందువల్ల ప్రజలు ఏమాత్రం అనారోగ్యం బారినపడినా పరీక్షలు చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఒకరిద్దరికి రెండోసారి కరోనా వచ్చినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై తదుపరి పరిశోధన జరగాల్సి ఉందన్నారు. అయితే వారికి మొదటిసారి వచ్చినప్పుడు తప్పుగా పాజిటివ్ అని వచ్చిందా లేక నిజంగానే రెండోసారి వైరస్ సోకిందా అనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు.
హాంకాంగ్‌లో కొందరికి రెండోసారి కరోనా వచ్చినట్లు నిరూపితమైందని, కాబట్టి రాష్ట్రంలోనూ వచ్చే అవకాశాలున్నాయన్నారు. ‘హాంకాంగ్‌లో మొదటిసారి లోకల్ స్ట్రెయిన్‌తో వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్‌లోని స్ట్రెయిన్ వల్ల మళ్లీ అక్కడ వచ్చింది. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. మొదటిసారి వైరస్ సోకినప్పుడు ఉన్నంత ప్రభావం రెండోసారి ఉండట్లేదు’ అని శ్రీనివాసరావు వివరించారు.