హైదరాబాద్: యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త రకం వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గడచిన నెల రోజుల్లో బ్రిటన్ నుంచి దాదాపుగా 3 వేల మంది తెలంగాణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారి వివరాలను రాష్ట్రానికి కేంద్రం అందించింది.
కేంద్రం నుంచి వచ్చిన జాబితా లోని వారిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మందిని ఒక గ్రూపు, డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,200 మందిని రెండో గ్రూపుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మంది వివరాలు తెలుసుకొని వారిని ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయా లేదా గుర్తిస్తారు. వారిని పరిశీలనలో మాత్రమే ఉంచుతారు.
ఇక రెండవ గ్రూపులో ఉన్న 1,200 మందిపై ఇప్పుడు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఎక్కువ దృష్టి సారించింది. వారిలో 800 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారేనని అధికారులు తేల్చారు. వారిని వెతికే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారిలో ఇప్పటికే 200 మందిని గుర్తించారు. వారి నుంచి నమూనాలు తీసుకొని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్ వచ్చిదని అధికారులు తెలిపారు.
యూకే నుంచి వచ్చిన వారి నుంచి ఆర్టీపీసీఆర్‌తో పాటు బ్రిటన్ లో కనిపించిన వైరస్ కొత్త రకమా కాదా అని తెలుసుకునేందుకు జీనోమ్ విశ్లేషణ చేస్తారు. అయితే ఆరీ్టపీసీఆర్‌లో పాజిటివ్ వస్తేనే జీనోమ్ విశ్లేషణకు శాంపిల్‌ను పంపిస్తారు. జీనోమ్ విశ్లేషణ కోసం శాంపిళ్లను ముందుగా పుణేలోని వైరాలజీ లేబరేటరీకి పంపాలని భావించారు. కానీ హైదరాబాద్ సీసీఎంబీకే పంపాలని తర్వాత నిర్ణయించారు.
బ్రిటన్ నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా కాల్‌చేస్తే ఇంటికొచ్చి నమూనాలు తీసుకొని పరీక్షలు చేస్తారు. అందుకోసం 040–24651119 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.