టాలీవుడ్: పోయిన సంవత్సరం లాక్ డౌన్ సమయం లో ఉపాధి లేక రోజువారీ మనుగడకి కష్టపడుతున్న ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్న సినీ కార్మికుల కోసం మెగా స్టార్ చిరంజీవి గారు సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే పేరుతో నిధులు సేకరించి ఎంతో మంది సినీ కార్మికుల్ని ఆదుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుండడం అంతే కాకుండా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం తో సీసీసీ పేరుతో కరోనా వాక్సిన్ డ్రైవ్ ని జరపడానికి పూనుకున్నారు చిరంజీవి.
ఈ కరోనా వాక్సిన్ డ్రైవ్ ద్వారా 45 ఏళ్ళు పై బడిన సినీ కార్మికులు మరియు సినీ జర్నలిస్టులు ఉచితంగా వాక్సిన్ వేయించుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలోని వారు కూడా ఈ వాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు. అపోలో హాస్పిటల్ వారి భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా వాక్సిన్ వేయించుకున్న తర్వాత నెల రోజుల వరకు ఏమన్నా అస్వస్థతకి గురైతే అపోలో హాస్పిటల్ లో ఉచితంగా సంప్రదించే సదుపాయం కూడా ఉన్నట్టు తెలిపారు. మందులు కూడా రాయితీ ధరల్లో పొందే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ వారీగా అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్ పొందాలని ఆయన కోరారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినీ కార్మికులకు కరోనా నుండి కాపాడడానికి ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు.