అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్ధులకు ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం వరకు సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా తగు చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాలిక సిద్ధమైంది. వచ్చే 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పూర్తిగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రాబోతున్నాయి.
దేశ విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒక ఎంవోయూ కూడా ఈపాటికే కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సదరు సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది.
తాజాగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలు చేయడం వల్ల ఏపీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్ల వరకు పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి.