తెలంగాణ: మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి స్థాయిలో ఉండి కేటీఆర్ వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేయటం బాధ్యతారాహిత్యంగా ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
పరువు నష్టం దావా
కేటీఆర్, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు, కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కామెంట్లు తొలగించమన్న కోర్టు
కోర్టు తీర్పు మేరకు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అన్ని మీడియా మాధ్యమాలు, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు సమాజంలో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున పబ్లిక్ డొమైన్‌లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది.
రాజకీయవర్గాల స్పందన
ఈ తీర్పు సంతోషకరమని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతుండగా, గతంలో కూడా కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆమె తీరు మారలేదని విమర్శిస్తున్నారు. ఈ కేసు తీర్పుతో కేటీఆర్‌కు న్యాయస్థానంలో విజయాన్ని అందించినట్లైంది.
మరిన్ని పరిణామాలు
ఇప్పటికే నాగార్జున కుటుంబంపై కూడా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సురేఖ ఈ తరహా వ్యాఖ్యల ద్వారా రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లు పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.