జాతీయం: కోల్‌కాతా ఆర్జీకర్ హత్యాచార ఘటనలో కోర్టు కీలక తీర్పు
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రి కేసులో శనివారం కోల్‌కతా సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
“నీకు శిక్ష తప్పదు. ఈ ఘోరానికి యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష విధించవచ్చు,” అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో భారీ భద్రత మధ్య సంజయ్ రాయ్‌ను హాజరుపరిచారు. తాను నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారనే ఆరోపణలు సంజయ్ రాయ్ జడ్జికి తెలిపాడు. ఈ విషయంలో సోమవారం తన వాదనలు వినిపించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించనుంది.
గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దాడి జరిగింది. ఈ ఘటన తీవ్ర నిరసనలతోపాటు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి, అభియోగాలు దాఖలు చేసింది.
ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరు మాత్రమే చేర్చింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే సామూహిక అత్యాచారం అంశం అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు.
ఈ కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. కానీ, 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో వారిద్దరికీ బెయిల్ లభించింది.
ఈ తీర్పు నేపథ్యంలో కోల్‌కతాలోని సీల్దా కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మృతురాలి తండ్రి కోర్టు తీర్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. “మా కూతురి కోసం న్యాయం జరగడం సంతోషకరం,” అని భావోద్వేగంతో పేర్కొన్నారు.