హైదరాబాద్: భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కరోనా టీకా పొందడం వల్ల 14 రకాల సాధారణ సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఇవిగాక అరుదుగా మరో ఐదు రకాల సీరి యస్ రియాక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
ప్రజలు టీకా తీసుకునే ముందు ఆ కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి తమ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, కొన్ని రకాల అలర్జీలు, రక్తస్రావం సమస్యలు, జ్వరంతో ఉన్నవాళ్లు, బ్లడ్ థిన్నర్‌లు (రక్తాన్ని పలుచ బరిచే మందులు) వాడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు, కోవాగ్జిన్ టీకాను తీసుకోక పోవడమే మంచిదని పేర్కొంది.
కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి సందేశాలు అందినవారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ఈ మేరకు ఐదు పేజీలతో కోవాగ్జిన్ టీకా ఫ్యాక్ట్‌షీట్‌ను భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకునే ముందు కేంద్రంలో కోవాగ్జిన్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించింది. అనంతరం వేసుకోవాలా? లేదా? అనేది లబ్దిదారుల ఇష్టమేనని స్పష్టం చేసింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించిందని ఫ్యాక్ట్‌షీట్‌లో భారత్ బయోటెక్ తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్ వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని వివరించింది.
తమ కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో కొందరికి సాధారణంగా 14 రకాల సైడ్‌ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. వికారం, వాంతులు, దద్దుర్లు, నీరసం, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్ వేసినచోట నొప్పి, వాపు, ఎర్రబారడం, దురద వంటివి ఉంటాయి. అలాగే ఇంజెక్షన్ వేసిన చేయి పైభాగం బిగుతుగా (కండరాలు పట్టేసినట్లుగా) తయారవుతుంది. ఇలా కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.
దానితో పాటు చాలా అరుదుగా కొందరిలో మాత్రమే ఈ ఐదు రకాల సీరియస్ సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ముఖంపైనా, గొంతులో వాపు రావడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, మైకంతో కూడిన నీరసం ఏర్పడటం జరుగుతుంది.