అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కోవిడ్–19 నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
కరోనా కట్టడికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నాం. క్లస్టర్లలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వేగంగా కేసులను గుర్తించగలుగుతున్నాం. కరోనా బాధితులకు సత్వరమే చికిత్స అందించడం ద్వారా మరణాలను నియంత్రిస్తున్నాం. వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించడంతోపాటు అన్ని ఆస్పత్రులలో మౌలిక వసతులను మెరుగుపరిచాం.
ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు గుర్తించగానే పుణెలోని ల్యాబ్‌కు శాంపిల్ పంపించాం. రాష్ట్రంలో కనీసం ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని స్థితి నుంచి ఇవాళ ప్రతి 10 లక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేసే స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఇవాళ 13 జిల్లాలలో కోవిడ్ పరీక్షా కేంద్రాలు, చికిత్స అందించేందుకు పూర్తి సదుపాయాలు ఉన్నాయి.
కరోనా తో ఆస్పత్రిలో చికిత్సకోసం వచ్చిన ఏ ఒక్కరూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నది మా లక్ష్యం. కోవిడ్ పరీక్షలు అవసరమైన వారికి నిరాకరించకూడదని మా విధానం. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 100కుపైగా మొబైల్ యూనిట్ల ద్వారా 1,500కు పైగా కేంద్రాల్లో శాంపిల్స్ ను సేకరిస్తున్నాం.
రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాం. 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 32 వేలమంది వైద్యసేవల్లో నిమగ్నమయ్యారు. స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్నవారి కోసం మరో 109 కోవిడ్ కేర్ సెంటర్లలో 56 వేలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్‌కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం 3,286 ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఉండగా ఇప్పుడు 11 వేలకుపైగా అందుబాటులో ఉన్నాయి.