న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సోకి మరణించిన వారికి మరణ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. కోవిడ్ వల్ల ఎవరైన కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
సదరు బాధితులు ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు బాధితుల ఇళ్లను సందర్శిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, సరైన పత్రాలు లేని పక్షంలో వారికి తగు సాయం అందించాలని, ఈ క్రమంలో వారి నుంచి ఎటువంటి డబ్బులు ఆడగరాదని సీఎం సూచించారు.
కోవిడ్ వల్ల మరణించే ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని కేజ్రీవాల్, అధికారులకు స్పష్టం చేశారు. అయితే, కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ 50 వేల పరిహారాన్ని, అలాగే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు, కోవిడ్ కారణంగా అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు నెలకు రూ 2,500 చొప్పున స్టైఫండ్‌ను ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.