విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యూకేలో బయటపడ్డ కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ రోజు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని స్పష్టం చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్ వచ్చిందన్నారు.
ఈ మధ్య కాలంలో యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్ చేశామని పేర్కొన్నారు. వీరిలో మొత్తం 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు.
వారిలో మొత్తం 24 పాజిటివ్ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. ఏపిలో కేవలం రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.