న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకూ విపరీతంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా వ్యాక్సిన్ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో నియమించిన నిపుణుల బృందం ఈ ప్రక్రియను పర‍్యవేక్షిస్తోందని ప్రణాళికాబద్ధంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.
రాజ్యసభలో గురువారం హర్షవర్ధన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారత్‌లో జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌లు రెండూ తొలి దశ పరీక్షలను పూర్తి చేసుకున్నాయి.
డీసీజీఐ తదుపరి అనుమతులు లభించిన వెంటనే ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసే వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాళన్నీ విజయవంతమై నూతన ఏడాదిలో అందుబాటులోకి వచ్చి దేశాం మొత్తానికి వ్యాక్సిన్ పంపిణీ చేయలనుకుంటున్నట్లు ఆయన అన్నారు.