న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ టీకాల ధరలు త్వరలోనే తగ్గబోతున్నాయనే సమాచారం అన్ని చోట్లా వినిపిస్తోంది. దేశంలో వ్యాక్సిన్లపై ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులను తగ్గించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సిన్లపై పన్నులతో పాటు కొవిడ్ చికిత్సలో వాడుతున్న ఇతర ఔషధాలు, వైద్య పరికరాలపై విధిస్తున్న పనులు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని సమాచారం.
ఈనెల 28న జీఎస్‌టీ మండలి సమావేశంలో కొవిడ్ టీకాపై ప్రస్తుతం ఉన్న పన్నులు తగ్గించే అంశంపై చర్చించనుంది. కోవిడ్ వ్యాక్సిన్లపై పన్ను అంశమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగబోతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. టీకాలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మెడికల్ గ్రేడ్ పరికరాలపై పన్ను తగ్గింపు అంశాలను జీఎస్టీ మండలి పరిశీలించబోతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయంతో ప్రైవేటు సెక్టార్‌లో కూడా వ్యాక్సినేషన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో అనుమతి పొంది అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ల ధరలను ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. దగ్గర దగ్గరగా అన్ని కంపెనీల వ్యాక్సిన్ల ధరలు ఒక డోసు వెయ్యి రూపాయలకు పైగానే ఉన్నాయి. అందువల్ల జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే వ్యాక్సిన్ల ధర తగ్గి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.
కాగా రష్యాలో తయారైన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తిని భారత్‌లో కూడా ప్రారంభించారు. ఆర్‌డీఐఎఫ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం టీకా ఉత్పత్తిని పానేషియా బయోటెక్ సంస్థ చేపట్టగా ఇప్పటికే తొలి బ్యాచ్ టీకాలు కూడా సిద్ధమయ్యాయి. నాణ్యతా పరీక్షల కోసం తొలిబ్యాచ్ టీకాలను రష్యాలోని గామలేయ సెంటర్ ఫర్ క్వాలిటీ కంట్రోల్‌కు పంపించనున్నట్లు పానేషియా బయోటెక్ తెలిపింది.