న్యూఢిల్లీ: భారత ప్రముఖ యోగా గురువైన రాందేవ్ బాబా నుండి వివాదాస్పద వ్యాఖ్యలు మారోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో ఇస్తున్న కరోనా వ్యాక్సిన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని వ్యాఖ్యానించారు. రాం దేవ్ బాబా తాను టీకా వేసుకోలేదని, సుదీర్ఘ కాలంగా తాను సాధన చేస్తున్న యోగా మరియు ఆయుర్వేదమే తనకు రక్ష అని తెలిపారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ల సమర్థత మరియు అల్లోపతి ప్రభావంపై తన మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి ఆయన మాటలతో మరింత ఆజ్యం పోశారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెయ్యికోట్ల రూపాయల పరువు నష్టం దావా హెచ్చరిక అనంతరం రాందేవ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాను పలు దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నానని, కాబట్టి తనకు టీకా అవసరం ఏ మాత్రం లేదని రాందేవ్ వాదించారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్ ఉత్తరాఖండ్ డివిజన్ ఐఎంఏ పరువు నష్టం నోటీసును పంపించిన సంగతి తెలిసిందే.
“స్టుపిడ్ సైన్స్” అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పక పోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. వ్యాక్సినేషన్ విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.