న్యూఢిల్లీ : కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్లను రూపొందించే ప్రక్రియ ఊపందుకుంది. అంతర్జాతీయంగా ప్రయోగాలు కీలక దశల్లో సానుకూల ఫలితాలతో వ్యాక్సిన్‌పై ఆశలను పెంచుతున్నాయి. భారత దేశీం లో కూడా కనీసం ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని, వాటిలో రెండు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కు చేరుకున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీపై ప్రధానమంత్రికి సలహా ఇచ్చే ప్యానెల్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ అన్నారు.
అందులో భారత్ బయోటెక్‌కు చెందిన భారతీయ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇప్పటికే దశ-3 క్లినికల్ ట్రయల్ కూడా ప్రారంభించింది అని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఫేజ్-3 అధునాతన దశలో ఉందన్నారు. అలాగే కాడిలా వ్యాక్సిన్ , రష్యాకు చెందిన స్పుత్నిక్వి ట్రయల్ ఫేజ్-2 ట్రయల్ ప్రిపరేషన్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.
కాగా జైడస్ కాడిలా రూపొందించిన జైకోవ్-డి దేశంలో రెండవ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో టీకా కోవిషీల్డ్ ఇటీవల భారతదేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్ ను ప్రారంభించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ త్వరలో దేశంలో రష్యన్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని తెలిపారు.
దేశంలో టీకా అందుబాటులోకి వచ్చాక ఫ్రంట్‌లైన్ కార్మికులకే తొలి ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యంగా మరణాలను తగ్గించడం, ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికే దేశం మొదటి ప్రాధాన్యతనిస్తుందని పాల్ తెలిపారు. సుమారు 30 కోట్ల ప్రాధాన్యతా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.
ప్రారంభ దశలో టీకా అందించేవారిని నాలుగువర్గాల వ్యక్తులుగా వర్గీకరించింది. వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్మికులతో సహా ఒక కోటి మంది ఆరోగ్య నిపుణులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలతో సహా రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉంటారని తెలిపారు.