ముంబై: హ్యుండాయ్ వారి ఎస్‌యూవీ ఆల్-న్యూ ‘క్రెటా’ 1.21 లక్షల వాహనాలు గడిచిన ఏడాది కాలంలో అమ్ముడైనట్లు హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తెలిపింది. సరికొత్త వెర్షన్‌లో ఆల్–న్యూ క్రెటా కిందటేడాది మార్చిలో విడుదలైంది. ఈ మోడల్ దేశంలో కంపెనీ ఎస్‌యూవీ విభాగానికి తలమానికంగా నిలిచింది.
కాగా భారత ఆటో పరిశ్రమలో ఒక ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా హ్యుండాయ్ తమ ఆల్-న్యూ క్రెటా వాహనం రికార్డును నమోదు చేసినట్లు హ్యుందాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము చేసే మన్నికైన తయారీ
మరియు ఎంతో ఆకర్షణీయమైన అధునాతన ఫీచర్లను కలిగిన మోడళ్లను తమ కస్టమర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారని చెప్పడానికి క్రెటా విక్రయాలే నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు.
ఇక 2015 జూలైలో విడుదలైన క్రెటా కార్ల అమ్మకాలు ఇప్పటి వరకు భారత్‌లో 5.8 లక్షలుగా ఉండగా ఈ క్రెటా అమ్మకాలు అంతర్జాతీయ మార్కెట్లో 2.16 లక్షల వాహనాలకు చేరుకున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.