జాతీయం: టీమిండియా క్రికెట్ స్టార్ రవీంద్ర జడేజా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఈ విషయాన్ని జడేజా భార్య రివాబా జడేజా ఎక్స్ (మాజీగా ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
రివాబా జడేజా ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. ఆమె 2019లో బీజేపీలో చేరి, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుండి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రవీంద్ర జడేజా గతంలో తన భార్య రివాబాతో కలిసి పలు రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. అయితే, బీజేపీలో జడేజాకి ఏ రకమైన బాధ్యతలు కేటాయిస్తారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జడేజా క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, టీ20 క్రికెట్ నుంచి 2024 లో రిటైర్ అయిన జడేజా, వన్డేలు, టెస్టులు ఆడటం కొనసాగిస్తారు. రవీంద్ర జడేజా తన టీ20 అంతర్జాతీయ కెరీర్ లో 74 మ్యాచ్‌లు ఆడారు, 515 పరుగులు చేసి 54 వికెట్లు తీశారు. 2024 టి20 ప్రపంచ కప్ విజయం సాధించిన తర్వాత, జడేజా జూన్ 29న టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు.
ఈ మధ్య బార్బడోస్ లో జరిగిన టోర్నమెంట్ విజయం తర్వాత, జడేజా క్రికెట్‌కు కాస్త విరామం తీసుకుని రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్‌కి అడుగుపెట్టారు.
ఇదిలా ఉంటే, బీజేపీ దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2న ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ తొలి సభ్యత్వం తీసుకుని, తన ప్రాథమిక సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకున్నారు.