లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై గెలుపొందింది. ఈ గెలుపుతో వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి క్రొయేషియా డబుల్స్ జంటగా మెక్టిక్-పావిక్ జోడీ చరిత్ర సృష్టించింది. అయితే, మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్లో ఇది ఎనిమిదవ టైటిల్ అవడం విశేషం.
కాగా, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్‌ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్‌కు, మెక్టిక్‌తో కలిసి గెలిచిన మొదటి టైటిల్ ఇదే. ఇంకోవైపు మెక్టిక్ సాధించిన తొలి గ్రాండ్‌స్లామ్ ఇదే. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్‌లోనూ కలిసి ఒకే జంటగా రంగంలోకి దిగనుంది. శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ 6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్ టైటిల్‌ని గెలుచుకుంది.
ఇదిలా ఉండగా, తమ కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుని దిగ్గజ ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన నిలిచేందుకు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, తుది పోరులో ఏడో సీడ్ ఇటలీ ఆటగాడు మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ భారత సమయం ప్రకారం ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.