అమరావతి: రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులను అర్బన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గుడిసెలు, మట్టి మిద్దెలలో నివసిస్తున్న ప్రజలను మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.
అవసరమైన చోట తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోవడంతో విద్యుత్‌కు సరఫరాకు పలు చోట్ల అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో తుపాన్ ప్రభావంతో వరిపంట పూర్తిగా నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుపాను ప్రభావంతో కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద కడప – తిరుపతి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు కిలోమీటర్లు మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద ఉధృతిని ఎస్పీఅన్బురాజన్ పరిశీలించారు.
చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో తుపాన్ ప్రభావంతో ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరిచేలు తడిసి ముద్దయ్యాయి. కనీస పెట్టబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పిఠాపురం మండలం సూరాడపేట వద్ద సముద్రం అలల ఉధృతికి 100 మీటర్ల మేర సముద్రం చొచ్చుకొచ్చింది. ఒడ్డున ఉన్న రెండు పూరి గుడిసెలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వంసం అయ్యాయి. రాల మండలం వాడరేవులోని మత్స్యకారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చీరాల ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద జెండాను అధికారులు ఎగురవేశారు.