స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం చేసుకుంది. అయితే, ఈ విజయాన్ని మసకబార్చేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వివాదం చెలరేగుతోంది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై ఎంఐ ఫ్యాన్స్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ సమయంలో ఓ చిన్న వస్తువుతో బంతిని రబ్ చేసినట్లు కనిపిస్తోందని, అనంతరం అదే వస్తువును రుతురాజ్‌కు అందజేశాడని MI అభిమానులు చెబుతున్నారు. ఆ వస్తువు జేబులో పెట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తోందంటూ ప్రచారం జరగుతోంది. దీనిపై #BanCSK, #BallTampering అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో మూడేసి కీలక వికెట్లు తీసి చెన్నై విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మను డకౌట్ చేయడం టర్నింగ్ పాయింట్‌గా మారింది. అయితే ఇప్పుడు అతని ప్రదర్శనపై ఈ ఆరోపణలతో మళ్ళీ చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా, చెన్నై ఫ్యాన్స్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వీడియోలో ఏ వస్తువూ స్పష్టంగా కనిపించలేదని, అది కేవలం చ్యూయింగ్ గమ్ అయి ఉండొచ్చని అంటున్నారు. అంతే కాక, అంపైర్లు ప్రతీ మిశ్రమాన్ని పరిశీలించే అవకాశం ఉండడంతో, ఇలాంటి ఆరోపణలు నిరాధారమని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వివాదంపై బీసీసీఐ లేదా ఐపీఎల్ నిర్వాహకులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో, అధికారిక విచారణ జరిగే వరకు వేచి చూడాల్సిందే.