షార్జా: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్–2020లో తిరిగి తమ మొదటి స్థానానికి చేరుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ మినహా అంతా విఫలమయ్యారు.
ట్రెంట్ బౌల్ట్ (4/18) ప్రత్యర్థిని కుప్పకూల్చి ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అయ్యాడు. అనంతరం ముంబై 12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
ఒక వైపు నుంచి బౌల్ట్, మరోవైపు నుంచి బుమ్రా పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే చెన్నై బ్యాట్స్‌మెన్ నిస్సహాయులుగా కనిపించారు. డగౌట్ చేరడానికి వారంతా ఒకరితో మరొకరు పోటీ పడినట్లు కనిపించింది. తీవ్ర ఒత్తిడి మధ్య అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0) డకౌట్ కాగా, అనుభవజ్ఞులు అంబటి రాయుడు (2), డుప్లెసిస్ (1) కూడా చేతులెత్తేశారు.
అనవసరపు షాట్‌కు ప్రయత్నించి జడేజా (7) మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇవ్వడంతో పవర్‌ప్లేలోనే చెన్నై సగం వికెట్లు చేజార్చుకుంది. 6 ఓవర్లలో జట్టు స్కోరు 24/5 మాత్రమే. ఐపీఎల్ కెరీర్‌లో రెండోసారి మాత్రమే రెండో ఓవర్లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చిన ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, ఎక్కువసేపు నిలవలేదు. లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ చక్కటి బంతితో ధోని ఆటకట్టించాడు.
సీజన్ మొత్తంలో సీఎస్‌కే గురించి చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే అతని స్యామ్ కరన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన గురించే. తొలి మ్యాచ్ నుంచి తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా, ఏ స్థాయిలో బ్యాటింగ్ చేయించినా, ఎప్పుడు బౌలింగ్ అవకాశం ఇచ్చినా సత్తా చాటిన 22 ఏళ్ల కరన్ మరోసారి తన విలువను ప్రదర్శించాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో కరన్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్ గణాంకాలు ఈ ఓవర్‌తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఇషాన్ కిషన్, డికాక్‌లను చెన్నై బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. స్వేచ్ఛగా ఆడిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు రాబట్టారు. జడేజా ఓవర్లో వరుసగా 2 భారీ సిక్సర్లు కొట్టిన కిషన్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఎడమకాలి కండరాల గాయంతో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో కీరన్ పొలార్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.