స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించి, 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో మూడో విజయం నమోదు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, హైదరాబాద్ బౌలర్ల ఆత్మవిశ్వాసం ముందు తడబడింది. చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రెవిస్ 42 (38 బంతుల్లో), జడేజా 21, దీపక్ హుడా 22 పరుగులు చేశారు. షేక్ రషీద్ తొలి బంతికే డకౌట్ కాగా, కరన్, ధోనీ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. హర్షల్ పటేల్ 3/28, కమిన్స్ 2/30తో రాణించారు.
లక్ష్యఛేదనలో హైదరాబాద్ ఆరంభంలోనే బలంగా కనిపించింది. ఇషాన్ కిషన్ 44 (34 బంతుల్లో), కమిందు మెండిస్ 32* (22 బంతుల్లో), నితీశ్ కుమార్ రెడ్డి 19* పరుగులు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లతో 155/5 చేసి గెలుపొందింది.
సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2/26, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, జడేజా చెరో వికెట్ తీసినా, హైదరాబాద్ బ్యాటర్లపై ప్రెజర్ తీసుకురాలేకపోయారు.
ఈ విజయం ద్వారా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, సీఎస్‌కేకి మాత్రం ఇది ఏడో ఓటమిగా నమోదైంది. 9 మ్యాచుల్లో 2 గెలుపులతో వారి అవకాశాలు దాదాపుగా ముగిశాయి.
చెన్నైపై చెపాక్ వేదికగా తొలి విజయం నమోదు చేసిన హైదరాబాద్ జట్టుకు ఇది ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. మరోవైపు సీఎస్‌కే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించేలా మారింది.