బెంగళూరు: బీజేపీ పార్టీ కి చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలోని కీలక సభ్యుడు సీటీ రవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం రాత్రి ఆయన సీఎంకు పంపించారు.
ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దానితో పాటు ఇటీవల బీజేపీ అధిష్టానం ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవికి కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయనకు ఇటివలే పోస్టింగ్ లభించింది.
ఈ క్రమంలోనే మంత్రిపదవికి రాజీనామా సమర్పించిన రవి, సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవనున్నారు. జాతీయ రాజకీయాల్లో రావాలన్న పార్టీ పిలుపుమేరకు కేబినెట్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఇటీవలే కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు తాజా రాజీనామా నేపథ్యంలో యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన బీజేపీలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్లు సైతం పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదే నేపథ్యంలో రవి రాజీనామా చేయడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న కొద్ది రోజుల్లోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే వార్తలు కన్నడనాట ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.