హైదరాబాద్: హైదరాబాద్ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్, ఔషధ తయారీ రంగంలో ఉన్న ఈ సంస్థ గురువారం ఉదయం సైబర్ దాడికి గురైంది కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం.
ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యూఎస్, యూకె, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం అనుమానాలకు దారి తీస్తోంది.
సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్‌ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు.