వాషింగ్టన్: అమెరికాలో ఎపుడూ చూడని అతిపెద్ద సైబర్/రాన్‌సమ్‌వేర్ దాడి జరిగింది. యూఎస్ ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన కసెయా కంపెనీపై హ్యాకర్లు దాడి చేశారు. దాడి జరిగిన తర్వాత హ్యాకర్లు 70 మిలియన్ డాలర్లను డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం విలువ దాదాపు 520 కోట్ల రూపాయలు.
డార్క్ వెబ్‌సైట్ యొక్క హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తుంది. అమెరికాలో పెద్ద సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన కసేయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందింది.
కాగా ఈ సైబర్ దాడికి రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ప్రధాన కారణం అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి నుంచి వెనక్కి తగ్గాలంటే వారు సదరు కంపెనీని 70 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక వేళ ఈ డీల్ ఒప్పుకున్నట్లయితే, సైబర్ దాడిలో ఇదే అతిపెద్ద విలువైన సైబర్ దాడి అవుతుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలలో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్‌సమ్‌వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై వారు దర్యాప్తు ప్రారంభించారు.